భూ భారతి చట్టం రైతులకు చుట్టం: జిల్లా కాంగ్రెస్ నేత నాగరాజ్ గౌడ్
కామారెడ్డి/బీబీపేట్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన భూ భారతి చట్టం పేద రైతుల పాలిట గొప్ప వరమని, ఇది రైతులకు చుట్టంలా ఉండబోతుందని జిల్లా కాంగ్రెస్ నాయకుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి విధానంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కొత్త ఆర్ఓఆర్ 2025 చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం నిజమైన ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమని చెప్పారు.
ధరణి పొరపాట్లు – కొత్త చట్టంలో పరిష్కారం:
ధరణి రిజిస్ట్రేషన్ వ్యవస్థలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం లేక రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మాత్రం భూ భారతి చట్టంతో అలాంటి సమస్యలన్నింటికీ సులభ పరిష్కార మార్గాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
సాదా బైనామాల సమస్యలకు పరిష్కారం:
గ్రామీణ ప్రాంతాల్లో బహుళంగా ఉన్న సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూముల విషయంలో ఇప్పటివరకు పటా మార్పు సాధ్యం కాలేదని, భూ భారతి చట్టంతో వీటికి కూడా పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
భూదార్ నంబరు – భూములకు ఆధార్ లాంటి గుర్తింపు:
ప్రతి భూమికి ప్రత్యేకంగా భూదార్ నంబరు కేటాయించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని, భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం సాధ్యమవుతుందని చెప్పారు.
అప్పీలు చేసే అవకాశం – స్థానిక అధికారుల సేవలు:
నూతన చట్టంలో ఎలాంటి భూ సమస్యలు వచ్చినా ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ, కలెక్టర్ స్థాయిలో అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉండటంతో రైతులు న్యాయం పొందగలుగుతారని అన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారుల నియామకం వల్ల రైతులకు అవసరమైన అన్ని సేవలు గ్రామ స్థాయిలోనే లభిస్తాయని వివరించారు.
అవగాహన కార్యక్రమాలు – ప్రజాపాలనకు ఉదాహరణ.
ఈ చట్టంపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేయడాన్ని ప్రజాపాలనకు నిదర్శనంగా అభివర్ణించారు.
ధన్యవాదాలు – ప్రభుత్వానికి రైతుల తరఫున అభినందనలు:
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి, రైతులకు అన్ని సేవలు అందించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలకు, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి జిల్లా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Post a Comment