ఏడు నెలల్లో 25 పెళ్లిళ్లు: డబ్బు, నగలతో మోసం చేసిన యువతి అరెస్ట్
రాజస్థాన్‌లో ఓ షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. కేవలం ఏడాది కూడా కాకుండా, ఏడు నెలల కాలంలో 25 మంది పురుషులతో పెళ్లిళ్లు చేసుకుని, వారి వద్ద నుంచి డబ్బు, బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులు ఎత్తేసి పారిపోయిన 23 ఏళ్ల యువతి అనురాధ పాస్వాన్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనురాధ చేసిన ఈ పెళ్లిళ్లన్నీ చట్టబద్ధంగానే జరిపినవే కావడం గమనార్హం.
మోసాల తెరలేపిన ఫిర్యాదు
తాజాగా మే 3న వచ్చిన ఫిర్యాదు ద్వారా ఈ కేటుకారి మోసాల వ్యవహారం బయటపడింది. విష్ణు శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన వివరాల ప్రకారం, ఏప్రిల్ 20న అనురాధతో వివాహం జరిగింది. ఈ పెళ్లిని ఇద్దరు దళారుల సాయంతో కుదిర్చినట్లు తెలిపారు. వారు రెండు లక్షలు తీసుకుని సంబంధం ఏర్పాటుచేసారని వెల్లడించారు. కానీ, పెళ్లి జరిగిన కేవలం 12 రోజులకే అనురాధ మే 2న ఇంట్లో ఉన్న నగలు తీసుకుని పరారైంది.
ముఠా ద్వారా సాగిన పెళ్లిళ్ల మోసం
అనురాధ పూర్వం ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసుపత్రిలో పనిచేసింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత భోపాల్‌కు వెళ్లిన ఆమె, అక్కడ పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేసే ముఠాలో చేరింది. ఈ ముఠా సభ్యులు వాట్సాప్ ద్వారా సంబంధాలు ఏర్పరచి, వరుల నుండి 2 నుంచి 5 లక్షల వరకూ డబ్బు తీసుకుని పెళ్లిళ్లు జరిపేవారు. పెళ్లి అయిన కొన్ని రోజుల్లోనే వధువు నగలు, డబ్బుతో పరారయ్యేది. ఈ ముఠాలో అనేక మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పెళ్లి తర్వాత మరో మోసం
విష్ణు శర్మ ఇంటి నుంచి పారిపోయిన అనంతరం, అనురాధ భోపాల్‌లో గబ్బర్ అనే వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుంది. అతని వద్ద నుండి రెండు లక్షల రూపాయలు తీసుకుని మాయమైంది. పోలీసులు వరుడి వేషంలో ఓ వ్యక్తిని ఆమె వద్దకు పంపడంతో, ఆమెను పట్టుకోవడంలో విజయం సాధించారు.
ప్రస్తుతం అనురాధ విచారణలో ఉంది. ఈ ముఠాలో మరెంత మంది ఉన్నారు, వారు ఎన్ని రాష్ట్రాల్లో మోసాలు చేశారు అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Post a Comment