-->

ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్

 

ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్

మావోయిస్టు పార్టీలో గట్టి కలకలం

ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 20 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా, మరో ఎనిమిది మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు.

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల సమీపంలోని వెంకటాపురం, వాజేడు, పేరూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న కర్రేగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ నిఘాతో ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో అరెస్టైన మావోయిస్టుల నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ, "లొంగిపోయిన మావోయిస్టులు గతంలో వివిధ హోదాల్లో పనిచేసినవారని, వారికి ప్రభుత్వ పునరావాస పథకాల ప్రకారం సహాయం అందించబడుతుంది" అని తెలిపారు. లొంగిపోయిన వారిలో కొందరికి ఉన్న రివార్డులను 24 గంటల లోపు వారి ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.

పోలీసులు చేపట్టిన "పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి" కార్యక్రమం మంచి ఫలితాలిస్తోందని, మావోయిస్టులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి మానవతా దృష్టితో పునరావాసం కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్య సమస్యలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్ ములుగు జిల్లా శాంతి భద్రతల పరిరక్షణలో కీలక మలుపుగా మారినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.

Blogger ఆధారితం.