రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: అరుణ్ కుమార్ జైన్
వరంగల్ జిల్లా, అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆధునికరణ పనులకు మరింత వేగం తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు.
ఈ రోజు వరంగల్ చేరుకున్న జీఎం, రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. అక్కడ జరిగిన సమీక్ష సమావేశంలో వివిధ విభాగాల అధికారులతో చర్చించి, కీలక సూచనలు చేశారు. వచ్చే మే 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ రూపంలో రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనుండటంతో, ఆ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన స్వయంగా పర్యటించారు.
వరంగల్ రైల్వే స్టేషన్‌ను సమకాలీన వసతులతో తీర్చిదిద్దారు. విమానాశ్రయాలను తలపించే విధంగా లిఫ్టులు, ఎస్కలేటర్లు, ర్యాంపులు, విస్తృత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక సదుపాయాలు కల్పించారు.
ప్రముఖ కాకతీయ రాజుల కళా వైభవాన్ని ప్రతిబింబించే విధంగా స్టేషన్ నిర్మాణ శైలిని తీర్చిదిద్దారు. శిల్పకళ, నిర్మాణ నైపుణ్యం, మరియు ప్రాంతీయ సంస్కృతికి ప్రతినిధిగా ఉండేలా స్టేషన్ రూపురేఖలు తీర్చిదిద్దడంలో అధికారులు శ్రమించారు.
అమృత్ భారత్ స్టేషన్స్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 25 కోట్ల నిధులతో ఈ ఆధునికీకరణ పనులు చేపట్టింది. ఈ మార్పులతో వరంగల్ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.
ఈ పర్యటనలో అరుణ్ కుమార్ జైన్ స్టేషన్ పరిసరాల్లోని శుభ్రత, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిబంధనల ప్రకారం సమయానికి పనులు పూర్తి చేసి, నాణ్యతలో ఎక్కడా రాజీపడకూడదని ఆయన స్పష్టం చేశారు.
Post a Comment