-->

ఆపరేషన్ సిందూర్‌ పై కేంద్రం ప్రెస్‌మీట్: యూనిఫాంలో కనిపించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు..?

ఆపరేషన్ సిందూర్‌ పై కేంద్రం ప్రెస్‌మీట్: యూనిఫాంలో కనిపించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు..?


ఢిల్లీ: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ నిర్వహించిన "ఆపరేషన్ సిందూర్" ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆపరేషన్‌లో 9 కీలక టార్గెట్లు ధ్వంసమయ్యాయని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాడిలో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందారని అంచనా. అయితే పాకిస్తాన్ మాత్రం కేవలం 8 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రకటించింది.

ఈ ఆపరేషన్‌పై కేంద్రం నిర్వహించిన ప్రెస్‌మీట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అక్కడ ఉన్న ఇద్దరు మహిళా అధికారుల ఉనికిపై ఆసక్తి నెలకొంది. ఒకరు ఆర్మీ అధికారిణి, మరొకరు ఎయిర్ ఫోర్స్ అధికారి. వీరిద్దరూ సామాన్యులు కాదు, దేశ రక్షణలో తమదైన ముద్ర వేసిన వీరులు. వారి గురించి మరింతగా తెలుసుకుందాం.

కల్నల్ సోఫియా ఖురేషి – భారత సైన్యంలో చరిత్ర సృష్టించిన వీరనారి

గుజరాత్‌కు చెందిన కల్నల్ సోఫియా ఖురేషి సైన్యంలో సేవ చేయడం ఆమె కుటుంబ వారసత్వంగా తీసుకువచ్చారు. తాత, తండ్రి సైతం సైన్యంలో పనిచేశారు. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి పాస్‌ అవుతూ భారత సైన్యంలో చేరారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించిన ఆమె, సిగ్నల్స్ రెజిమెంట్‌లో అనేక కీలక భాద్యతలు నిర్వహించారు.

2016లో జరిగిన ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18 లో భారత సైన్య బృందాన్ని నడిపిన తొలి మహిళా అధికారిగా రికార్డు సృష్టించారు. ఈ మల్టీనేషనల్ విన్యాసంలో 18 దేశాలు పాల్గొన్నాయి. సోఫియా ఖురేషి మాత్రమే మహిళా లీడర్‌గా ఒక బృందానికి నాయకత్వం వహించారు. ఇది ఆమె నాయకత్వ సామర్థ్యానికి చక్కటి ఉదాహరణగా నిలిచింది.

వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ – ఆకాశాన్ని అధిరోహించిన అధ్బుతం

వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వాయుసేనలో సేవలందిస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్ల నడపడంలో అత్యద్భుత నైపుణ్యం కలిగిన ఆమె, ఇప్పటివరకు 2500 గంటలకుపైగా విమాన సర్వీసు పూర్తి చేశారు. ఎత్తైన పర్వతాలు, విపరీత వాతావరణ పరిస్థితుల్లో హెలికాప్టర్ నడిపే క్షమత ఆమెకు ఉంది.

కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో వరదలు, భూకంపాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఆమె కీలక భూమిక పోషించారు. చిన్నప్పటి నుంచే పైలట్ కావాలనే కల ఆమెను వాయుసేనలోకి తీసుకొచ్చింది. యుద్ధ హెలికాప్టర్ నడపడం అంటే సెకన్లలో నిర్ణయాలు తీసుకునే ధైర్యం కావాలి. అలాంటి ధైర్యంతో దేశానికి సేవలందిస్తున్నారు వ్యోమికా.

నిరూపణగా నిలిచిన వీరమహిళలు
ఆపరేషన్ సిందూర్‌ వెనుక ఉన్న మేధా, దృఢతకు ప్రతిరూపంగా నిలిచిన ఈ ఇద్దరు మహిళలు దేశానికి గర్వకారణం. దేశ రక్షణలో మహిళల పాత్ర ఎలా విస్తృతమవుతోందో స్పష్టంగా చూపించిన ఈ సందర్భం చరిత్రలో నిలిచిపోతుంది.

Blogger ఆధారితం.