ఎస్సీ కులాల అభివృద్ధిపై ఆంక్షలు ఎత్తివేయాలి – పినపాకలో ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం ఉద్యమం మళ్లీ జోరందుకుంది. ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ కులాల అభివృద్ధిపై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట భారీగా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ పెనక సమ్మయ్యకు వినతి పత్రాన్ని అందజేసిన నాయకులు, పేద ఎస్సీ కుటుంబాలకు భూములు లేకపోవడం, నివాస హక్కులు లేకపోవడం, సాగుభూములపై ఆంక్షలు వంటి సమస్యలను ప్రస్తావించారు. ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా ఎస్సీ రైతులకు సాగు భూములపై హక్కుపత్రాలు మంజూరు చేయాలని, తద్వారా వారికి రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణాలు లభించేలా చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, “ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలతో పాటు ఎస్సీ కులాల అభివృద్ధికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది సాంఘిక న్యాయ పరిరక్షణకు కీలకం” అని తెలిపారు.
ఈ ధర్నాలో రాష్ట్ర నాయకులు జాడి లక్ష్మయ్య, మండల మాజీ ఎంపీటీసీ సోంపల్లి తిరుపతితి, జిల్లా నాయకులు ఇనుముల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ జాడి కిరణ్, ఇతర మహిళా నాయకులు నరాల రాజేష్, బసారికారి లక్ష్మి, జాడి నాగలక్ష్మి, కొమరం సమ్మక్క, మైపా కాంతమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.
Post a Comment