-->

ఓడిన అభ్యర్థి కుటుంబంపై గెలిచిన అభ్యర్థి ట్రాక్టర్‌తో దాడి.. నలుగురు తీవ్ర గాయాలు

ఓడిన అభ్యర్థి కుటుంబంపై గెలిచిన అభ్యర్థి ట్రాక్టర్‌తో దాడి.. నలుగురు తీవ్ర గాయాలు


కామారెడ్డి | డిసెంబర్ 15: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి జరగడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గ్రామంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు ఇంటి ముందు ఎన్నికల ఫలితాల అనంతరం ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులు కూర్చున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య సోదరుడు ట్రాక్టర్‌తో వారిపై దూసుకెళ్లినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

దాడి సమయంలో “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు” అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిబాబా అండదండలే కారణమని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బిట్ల బాలరాజుతో పాటు ఆయన అనుచరులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు నిరసనగా గ్రామస్థులు రెండు గంటలుగా రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని, గ్రామంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793