-->

ఏడేళ్ల కూతురిని మూడో అంతస్తు నుంచి తోసేసిన హత్య చేసిన తల్లి

ఏడేళ్ల కూతురిని మూడో అంతస్తు నుంచి తోసేసిన హత్య చేసిన తల్లి


హైదరాబాద్, మల్కాజ్‌గిరి: హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ తల్లి తన ఏడేళ్ల కూతురిని అపార్ట్‌మెంట్ మూడవ అంతస్తు పై నుంచి కిందకు తోసివేసి హత్య చేసిన దారుణ సంఘటన కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వసంత్‌పురి కాలనీలో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న దంపతులకు షారోన్ మేరీ (7) అనే కుమార్తె ఉంది. బాలిక తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుండగా, తల్లి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.

సోమవారం సాయంత్రం బాలికను అపార్ట్‌మెంట్ పైకప్పుకు తీసుకెళ్లిన తల్లి అకస్మాత్తుగా మూడవ అంతస్తు నుంచి కిందకు తోసేసింది. పక్కనే ఉన్న భవనం మెట్లపై పడిన చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బాలికను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, కాసేపటికే బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. తల్లిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793