రేపే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్
హైదరాబాద్, డిసెంబర్ 16 : గ్రామపంచాయతీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. జిల్లాలో ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తవగా, మూడో విడత పోలింగ్ బుధవారం జరగనుంది. తొలి రెండు విడతల్లో మొత్తం 11 గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 131 గ్రామపంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు.
మూడో విడతలో మొత్తం 68 గ్రామపంచాయతీలు ఉండగా, వాటిలో ఒకటి ఏకగ్రీవమైంది. మిగిలిన 67 గ్రామపంచాయతీలకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ దశ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 4,157 గ్రామపంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలైంది.
సర్పంచ్ పదవుల విషయానికి వస్తే, 11 చోట్ల నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగలేదు. 394 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,752 సర్పంచ్ పదవుల కోసం 12,640 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అదే విధంగా, మొత్తం 36,434 వార్డులకు గాను 7,916 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. తొలి రెండు విడతల్లో కొన్ని చోట్ల హోరాహోరీ పోరు సాగగా, మరికొన్ని ప్రాంతాల్లో రాజకీయ, నైతిక పొత్తుల ప్రభావంతో ఫలితాలు వెలువడ్డాయి.
అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుని హస్తం హవాను చాటినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ నిలవగా, బీజేపీ, రెబెల్ అభ్యర్థులు మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
మూడో విడత ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ దశ ఫలితాలు గ్రామీణ రాజకీయాల దిశను నిర్దేశించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Post a Comment