-->

విధి ఆడిన వింత నాటకం.. రెండు వారాల వ్యవధిలో భార్యాభర్తల మృతి

విధి ఆడిన వింత నాటకం.. రెండు వారాల వ్యవధిలో భార్యాభర్తల మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్‌లోని కేటీపీఎస్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. జలగం ప్రభావతి టీచర్ వడదెబ్బ కారణంగా ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మృతి చెందారు. ఇటీవలే ఆమె భర్త జలగం భాస్కర్ రావు కూడా సన్‌స్ట్రోక్ కారణంగా మే 11, 2026న మరణించగా, కేవలం 14 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

జలగం భాస్కర్ రావు కేటీపీఎస్‌లో ఫోర్‌మెన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. భర్త మృతి బాధ నుంచి కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోకముందే ప్రభావతి టీచర్ కూడా కన్నుమూయడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

ప్రభావతి టీచర్ కేటీపీఎస్ కాలనీలో అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి మంచి ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారు. ఆమె వద్ద చదువుకున్న పలువురు విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. పిల్లల పట్ల ప్రేమ, బోధనపై అంకితభావం, సౌమ్య స్వభావంతో ఆమె అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు.

ఒకే కుటుంబంలో వరుసగా జరిగిన ఈ రెండు మరణాలు కేటీపీఎస్ కాలనీలో విషాదఛాయలు నింపాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, పూర్వ విద్యార్థులు ప్రభావతి టీచర్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793