జామా మస్జీద్‌లో ఘనంగా ముగిసిన ఇస్లామిక్ బేసిక్ నాలెడ్జ్ సమ్మర్ క్లాసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని జామా మస్జీద్‌లో గత నెల రోజులుగా నిర్వహించిన ఇస్లామిక్ బేసిక్ నాలెడ్జ్ సమ్మర్ క్లాసులు ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగి నేటితో విజయవంతంగా ముగిశాయి. ముఫ్తీ యాకుబ్ సాహెబ్, అబ్దుల్ జలీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మర్ క్లాసుల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని ఇస్లామిక్ మౌలిక బోధనలు అభ్యసించారు.
ముగింపు కార్యక్రమం ఖురాన్ తిలావత్‌తో ప్రారంభమై ఎంతో భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ బాషీద్, జుబేర్, సాబీర్ పాషా తదితరులు మాట్లాడుతూ, నేటి కాలంలో చిన్నారులకు దీని వంటి దీన్ విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ విద్యతో పాటు ఇస్లామిక్ తాలీమ్ కూడా ప్రతి ముస్లిం పిల్లవాడికి తప్పనిసరి అని తెలిపారు.
సమ్మర్ క్లాసుల్లో విద్యార్థులకు ఖురాన్ మజీద్ సరైన తజ్వీద్‌తో పఠించడం, హదీస్ బోధనలు, నమాజ్ తరీకా, వుజూ విధానం, ఇస్లామిక్ అఖ్లాఖ్, తల్లిదండ్రులతో గౌరవంగా ఎలా ప్రవర్తించాలి, పెద్దలను ఎలా ఆదరించాలి, సమాజంలో మంచి ముస్లింగా ఎలా జీవించాలి వంటి అనేక ముఖ్యమైన విషయాలను బోధించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అలాగే ఇస్లాం శాంతి, సహనం, పరస్పర ప్రేమను బోధించే మతమని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి నమాజ్, ఖురాన్, సున్నత్ మార్గంలో నడవాలని మత పెద్దలు సూచించారు. చిన్న వయసులోనే దీన్ పట్ల ఆసక్తి పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో మంచి ముస్లిం సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు నిర్వాహకులు అందించ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మత పెద్దలు, ఉలేమా-ఏ-కిరామ్, పండితులు, తల్లిదండ్రులు మరియు మస్జీద్ కమిటీ సభ్యులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. సమ్మర్ క్లాసులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.
చివరగా దేశం, సమాజం మరియు ఉమ్మత్ శ్రేయస్సు కోసం ప్రత్యేక దువాతో కార్యక్రమం ముగిసింది.

Post a Comment