ప్రియుడి మోజులో భర్త హత్య.. జేసీబీతో గుంత తవ్వి పూడ్చిన భార్య
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పవిత్రమైన దాంపత్య బంధాన్ని మరిచి వివాహేతర సంబంధానికి బానిసైన ఓ మహిళ, చివరకు ప్రియుడితో కలిసి భర్తనే అడ్డుతొలగించుకోవడం విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారడం హృదయ విదారకంగా మారింది.
నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కల్పన స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు చింటూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారినట్లు సమాచారం.
భార్య ప్రవర్తనలో మార్పును గమనించిన ముత్యంరెడ్డి పలుమార్లు ఆమెను హెచ్చరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కుటుంబాన్ని కాపాడుకోవాలని సూచించినా కల్పనలో మార్పు రాలేదని తెలుస్తోంది. ప్రియుడితో కలిసి జీవించాలనే ఉద్దేశంతో భర్తను అడ్డుగా భావించిన కల్పన, అతడిని హత్య చేయాలని పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు వెల్లడించారు.
తొమ్మిది రోజుల క్రితం కల్పన తన ప్రియుడు చింటూతో కలిసి ముత్యంరెడ్డిని మనూర్ మండలం ఎల్గోయి గ్రామ శివారుకు తీసుకెళ్లింది. అక్కడ అతడిని హత్య చేసి, ఆధారాలు బయటపడకుండా ఉండేందుకు జేసీబీ సహాయంతో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు విచారణలో బయటపడింది.
అనంతరం భర్త కనిపించడం లేదంటూ కల్పనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రశ్నలకు తడబడిన కల్పన చివరకు నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం.
దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో కల్పనతో పాటు ఆమె ప్రియుడు చింటూను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
వివాహేతర సంబంధం కారణంగా ఒక కుటుంబం ఛిద్రమైపోగా, ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోయి.. తల్లి జైలుకు వెళ్లడంతో అనాధలుగా మారడం స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది.

Post a Comment