-->

బంగారం బిస్కెట్ల పేరుతో కోటి రూపాయల మోసం.. నమ్మించి పరారైన భోగ లక్ష్మీనారాయణ

బంగారం బిస్కెట్ల పేరుతో కోటి రూపాయల మోసం.. నమ్మించి పరారైన భోగ లక్ష్మీనారాయణ


ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో భారీ మోసం వెలుగుచూసింది. గ్రామస్తుల విశ్వాసాన్ని సంపాదించి, బంగారం బిస్కెట్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తి పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

కామేపల్లి మండలంలోని కెప్టెన్ బంజారా, బాసిత్ నగర్‌తో పాటు పరిసర గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులు మోసపోయినట్లు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా నందమూరి గ్రామానికి చెందిన భోగ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అయ్యప్ప గురుస్వామిగా గ్రామంలో పరిచయమయ్యాడు. తొమ్మిది నెలలుగా గ్రామంలోనే ఉంటూ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో విశ్వాసం సంపాదించాడు.

గ్రామస్తుల మంచి చెడు చూసుకుంటూ, పేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ, శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం, ఏడుపాయల దుర్గమ్మ ఆలయ యాత్రలు నిర్వహిస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నట్లు స్థానికులు తెలిపారు.

ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని తన వద్ద బంగారం బిస్కెట్లు ఉన్నాయని చెప్పి గ్రామస్తులను ఆకర్షించాడు. కెప్టెన్ బంజారా గ్రామానికి చెందిన కొందరితో పాటు బాసిత్ నగర్, వైరా తేల్దర్పల్లి, సీరోలు, కామేపల్లి ప్రాంతాల ప్రజల వద్ద నుంచి సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

ఇదే గ్రామానికి చెందిన కుమార్, పుష్ప అనే ఇద్దరిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి బంగారం బిస్కెట్లు చూపించినట్లు కూడా సమాచారం. అయితే డబ్బులు తీసుకుని వెళ్లిన లక్ష్మీనారాయణ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు గ్రహించారు.

లక్ష్మీనారాయణతో పాటు అతని అనుచరులుగా ఉన్న బాసిత్ నగర్‌కు చెందిన బానోత్ కుమార్, కల్లూరుకు చెందిన పుష్ప కూడా కనిపించకపోవడంతో బాధితులు కామేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని కామేపల్లి సీఐ ఎన్. సాగర్ వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793