వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య.. వరుసకు కొడుకుతో కలిసి భార్య దారుణం
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య.. వరుసకు కొడుకుతో కలిసి భార్య దారుణం
యాదాద్రి భువనగిరి జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించి వరుసకు కొడుకైన వ్యక్తితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులైన భార్య శారద, రాపోలు శివను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య (38), శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పంతంగి గ్రామ శివారులోని శనిగలగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.
భార్య శారదకు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్న దానయ్య ఆమెను పలుమార్లు మందలించాడు. గతంలోనూ ఆమె పంతంగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి వెళ్లిపోయి తిరిగి భర్త వద్దకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల దానయ్య సొంత అన్న కుమారుడు రాపోలు శివతో శారదకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం దానయ్యకు తెలియడంతో ఇద్దరినీ మందలించాడు. దీంతో తమ సంబంధానికి దానయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన శివ.. తన బాబాయిని హత్య చేస్తానంటూ పలుమార్లు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
పొలం వద్దకు తీసుకెళ్లి..
ఆదివారం దానయ్య సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లికి వెళ్లాల్సి ఉండగా శారద అతడిని వెళ్లకుండా ఆపి పొలం వద్దకు తీసుకెళ్లింది. అనంతరం తన ప్రియుడు శివను పొలం వద్దకు పిలిపించింది. శారద, శివ ఏకాంతంగా ఉన్న సమయంలో దానయ్య వారిని గమనించి శివతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో దానయ్య కిందపడిపోయాడు.
ఈ సమయంలో శారద దానయ్య కాళ్లను బిగ్గరగా పట్టుకోగా.. శివ అక్కడే ఉన్న బండరాళ్లతో అతడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దానయ్య అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణలో వెలుగులోకి..
హత్య అనంతరం శారద పక్క పొలంలో పనిచేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి తన భర్త కనిపించడం లేదని చెప్పింది. చుట్టుపక్కల వెతకగా దానయ్య రక్తపు మడుగులో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
శారద ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సంబంధించిన విషయాలను వెల్లడించినట్లు డీఎస్పీ తెలిపారు. మరోవైపు హత్య అనంతరం శివ తన సెల్‌ఫోన్లు, దుస్తులను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. వాటిని చిట్యాల మండలం గుండ్రాంపల్లి చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Post a Comment