ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైలం: శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వెలుగుచూసింది. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఈ నెల 20న ఆటోలో శ్రీశైలానికి చేరుకుని వడ్డెర అన్నదాన సత్రంలోని 11వ నంబర్ గదిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గత మూడు రోజులుగా గదిలో ఉన్న వారు బయటకు రాకపోవడంతో పాటు గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి పరిశీలించగా ఐదుగురు మృతదేహాలు కనిపించాయి.
మృతుల్లో ముగ్గురు మహిళలు బాత్రూమ్‌లో ఉరికి వేలాడుతూ కనిపించగా.. ఇద్దరు పురుషులు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులను సుధాకర్ (36), గోగుల ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా గుర్తించారు.
ప్రాథమిక విచారణలో కుటుంబ ఆర్థిక ఇబ్బందులే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో శ్రీశైలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Post a Comment