-->

హెచ్ఎండీఏపై మోజు.. డిప్యూటీ కలెక్టర్ షర్మిల సస్పెండ్

హెచ్ఎండీఏపై మోజు.. డిప్యూటీ కలెక్టర్ షర్మిల సస్పెండ్


హెచ్ఎండీఏలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం ఇటీవల షర్మిలను ఉట్నూరు ఆర్డీవోగా, అలాగే ఆదిలాబాద్ జిల్లా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఆమె కొత్త బాధ్యతల్లో చేరలేదు. దీంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ పనులపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఉట్నూరుకు వెళ్లకుండా ఆమె హెచ్ఎండీఏలోనే కొనసాగుతున్నట్లు సమాచారం. వృత్తిపరంగా ఎక్కడ బదిలీ చేసినా విధుల్లో చేరాల్సి ఉండగా, దూర ప్రాంతం కావడంతో ఉట్నూరుకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతుండటంతో అక్కడే కొనసాగాలని భావించినట్లు చర్చ జరుగుతోంది.

ఆమెను తక్షణమే ఆదిలాబాద్ జిల్లాలో విధుల్లో చేరాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ స్పందించకపోవడంతో నిబంధనల ప్రకారం సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షర్మిల సస్పెన్షన్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.

అలాగే సస్పెన్షన్ కాలంలో సీసీఎల్ఏ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793