-->

మదీనా చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 8 ఫైరింజన్లు

మదీనా చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 8 ఫైరింజన్లు


మదీనా చౌరస్తా పరిధిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చారిత్రాత్మక పాతబస్తీలోని ప్రముఖ వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలోని ఎస్వీజే కాంప్లెక్స్‌లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

వస్త్ర దుకాణంలో భారీగా నిల్వ ఉంచిన బట్టల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గత రెండు గంటలుగా ఫైర్ సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తూ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మంటలు దుకాణం గ్రౌండ్ ఫ్లోర్ వరకు వ్యాపించగా, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా స్పందించి మరింత విస్తరించకుండా అడ్డుకున్నారు. అయితే మదీనా చౌరస్తా పరిసరాల్లో దుకాణాలు అత్యంత దగ్గరగా ఉండటంతో పక్కనే ఉన్న ఇతర షాపులకు కూడా మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్క దుకాణాలకు నష్టం జరిగిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా చౌరస్తా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఘటన సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వరుస అగ్నిప్రమాదాలతో ఆందోళన

ఇటీవలి కాలంలో పాతబస్తీ ప్రాంతంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం స్థానికుల్లో భయాందోళనలకు కారణమవుతోంది. వాణిజ్య సముదాయాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? విద్యుత్ వ్యవస్థల నిర్వహణ సక్రమంగా ఉందా? అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వస్తున్నాయి.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన తనిఖీలు నిర్వహించి, భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వాణిజ్య సముదాయాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793