దొంగలకు ఆశ్రయం ఇచ్చిన లాడ్జ్ సీజ్.. ధర్మపురిలో మున్సిపల్ కమిషనర్ చర్యలు
ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మీ లాడ్జ్‌ను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మంగళవారం పోలీసుల బందోబస్తు మధ్య సీజ్ చేశారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎం జె జువెల్లెర్స్ దోపిడీ కేసులో పాల్గొన్న నిందితులు ఈ లాడ్జ్‌లో రెండు రోజుల పాటు బస చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
దోపిడీకి పాల్పడిన నిందితులు లాడ్జ్‌లో ఉండగా, నిర్వాహకులు సరైన వివరాలు నమోదు చేయకుండా గదులు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ నిర్లక్ష్యమే అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన భారీ దోపిడీకి పరోక్ష కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా లాడ్జ్‌పై సమగ్ర తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో లాడ్జ్ నిర్వహణలో అనేక లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా, బసకు వచ్చే యాత్రికులు, పర్యాటకుల గుర్తింపు పత్రాలు పరిశీలించకుండా గదులు కేటాయించడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సీసీ కెమెరాల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి అంశాలు వెలుగుచూశాయి. అదనంగా, లాడ్జ్ నిర్వహణకు అవసరమైన ట్రేడ్ లైసెన్స్ కూడా లేకుండానే వ్యాపారం కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు విజయ లక్ష్మీ లాడ్జ్‌ను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కమర్షియల్ షాపులు, లాడ్జీలు, ఇతర వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకొని నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Post a Comment