-->

ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై సస్పెండ్.

 

ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై సస్పెండ్.

కూకట్‌పల్లిలో మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) సురేష్ కుమార్‌పై పోలీసు శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ప్రస్తుతం ఎస్సై పరారీలో ఉన్నట్లు సమాచారం.

2018 బ్యాచ్‌కు చెందిన సురేష్ కుమార్ ప్రస్తుతం కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో యువతి అతనిపై విశ్వాసం పెంచుకుంది.

అయితే కొంతకాలం తర్వాత పెళ్లి విషయమై మహిళా కానిస్టేబుల్ ఒత్తిడి తీసుకురాగానే, సురేష్ కుమార్ వివిధ సాకులు చెబుతూ తప్పించుకోవడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం.

తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన బాధితురాలు ఎస్సైను నిలదీయగా, పెళ్లి సాధ్యం కాదని అతడు తేల్చి చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా కానిస్టేబుల్ కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్సై సురేష్ కుమార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా, అతను తన మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పరారైనట్లు వెల్లడైంది. బాధితురాలు సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన ఉన్నతాధికారులు విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సురేష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793