-->

షాద్‌నగర్ సర్కారు దవాఖానలో వైద్య నిర్లక్ష్యం కలకలం..

కాన్పు తర్వాత కడుపులో సర్జికల్ ప్యాడ్ మరిచిపోయిన సిబ్బంది


రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘోర వైద్య నిర్లక్ష్యం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాన్పు చేసిన సమయంలో వైద్య సిబ్బంది సర్జికల్ ప్యాడ్‌ను మహిళ కడుపులోనే మరిచిపోవడంతో ఆమె మూడు నెలల పాటు తీవ్ర నొప్పులు, రక్తస్రావంతో బాధపడిన ఘటన ఆలస్యంగా బయటపడింది.

బాధిత మహిళకు కొద్ది నెలల క్రితం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం నిర్వహించారు. అయితే కాన్పు అనంతరం ఆమెకు నిరంతరం కడుపునొప్పి, అసహనకరమైన రక్తస్రావం కొనసాగింది. ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పలుమార్లు ఆసుపత్రికి వెళ్లినా సరైన నిర్ధారణ చేయలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

తీవ్ర అస్వస్థతకు గురైన మహిళను అనంతరం మరో మహిళా వైద్యురాలు పరీక్షించగా గర్భసంచిలో సర్జికల్ ప్యాడ్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ప్రత్యేక చికిత్స చేసి ప్యాడ్‌ను తొలగించడంతో మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం.

ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మహిళ ప్రాణాలతో చెలగాటం ఆడారని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి కార్యనిర్వాహణ అధికారికి బాధిత కుటుంబ సభ్యులు అధికారిక ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793