-->

బ్యాంక్‌ మేనేజర్ లీలలు.. పనిచేస్తున్న చోటే గుట్టుగా కోట్ల స్కాం..!

బ్యాంక్‌ మేనేజర్ లీలలు.. పనిచేస్తున్న చోటే గుట్టుగా కోట్ల స్కాం..!


మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ బ్యాంక్ మేనేజర్‌నే బ్యాంకును కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం చివరకు అతడిని ఘరానా మోసగాడిగా మార్చినట్టు పోలీసులు గుర్తించారు.

మెదక్ పట్టణంలోని ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న యాదం అనిల్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడని దర్యాప్తులో తేలింది. భారీగా డబ్బు అవసరం కావడంతో తన భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం సహా మరికొందరి ఆధార్, పాన్ కార్డులను సేకరించి బ్యాంకులో 16 నకిలీ ఖాతాలను ప్రారంభించాడు.

ఆ ఖాతాల్లో వన్ గ్రాము నకిలీ బంగారాన్ని ఉంచి, వాటిని అసలైన బంగారు ఆభరణాలుగా బ్యాంక్ రికార్డుల్లో నమోదు చేశాడు. ఈ వ్యవహారంలో గోల్డ్ లోన్ ఆడిటర్ శ్రీనివాసచారి కూడా సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ బంగారం ఆధారంగా ఏకంగా రూ.1.49 కోట్ల గోల్డ్ లోన్లు మంజూరు చేసి, ఆ మొత్తాన్ని స్వంత అవసరాలకు వినియోగించినట్టు విచారణలో బయటపడింది.

ఇంతటితో ఆగకుండా, ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే సమయంలో కూడా అక్రమాలకు పాల్పడి మరో రూ.31.35 లక్షలను దారి మళ్లించాడు. మొత్తం కలిపి సుమారు రూ.1.80 కోట్ల మేర బ్యాంకుకు టోకరా వేసినట్టు అధికారులు తెలిపారు.

దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యాదం అనిల్ గతంలో ఆంధ్రప్రదేశ్ లోని వాలేరుపాడు ఏపీజీవీబీ బ్యాంకులో పనిచేసేటప్పుడు కూడా ఇలాంటి మోసానికే పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. పోలవరం నిర్వాసిత గిరిజనులను మోసం చేసి రూ.11 లక్షలు కాజేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ, తిరిగి అదే తరహా మోసానికి పాల్పడటం సంచలనంగా మారింది.

బ్యాంక్ సీఈఓ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మెదక్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మేనేజర్ భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం, ఆడిటర్ శ్రీనివాసచారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు యాదం అనిల్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనతో బ్యాంకింగ్ రంగంలో అంతర్గత భద్రతా వ్యవస్థలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గోల్డ్ లోన్లు, క్యాష్ లావాదేవీల విషయంలో పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793