ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆనంద్ గార్డెన్ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలను ఓ ఆటో ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం.. నర్సాపూర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న శుభకార్యానికి హాజరుకావడానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందిన దిలీప్, మనోహర్ అనే ఇద్దరు యువకులు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment