ఇంటర్ బోర్డు రద్దు ప్రతిపాదనకు బ్రేక్!
హైదరాబాద్, మే 10:తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై కొనసాగుతున్న అనిశ్చితికి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా తెరదించింది. ఈ విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు.
విద్యా సంస్కరణల్లో భాగంగా ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసి, సీబీఎస్‌ఈ తరహాలో 11, 12 తరగతులుగా మార్చే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన జరిపినప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది.
ఇటీవల ఇంటర్ ప్రవేశాల నిలిపివేతపై వెలువడిన ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం సూచించినట్లు సమాచారం.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఇంటర్మీడియట్ వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండటంతో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సమర్పించిన నివేదికలో, పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ వేరుగా ఉండటమేనని పేర్కొంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో 11, 12 తరగతులు పాఠశాల విద్యలోనే కొనసాగుతున్నాయని, ఇంటర్‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేస్తే విద్యార్థులు పై చదువులకు మరింతగా కొనసాగించే అవకాశం ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది.
ఈ అంశంపై ముఖ్యమంత్రి Revanth Reddy, ఎంపీ Vem Narender Reddy, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా తదితర ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Post a Comment