మహిళ దారుణ హత్య.. ప్రేమ పేరుతో వేధింపులే కారణమా?
పుట్ట్నూర్: పెద్దపల్లి జిల్లాలోని పాలకుర్తి మండలం పరిధిలోని పుట్నూర్ గ్రామం లో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం వేకువజామున వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలకు దారితీసింది.
బౌతు సుమలత (38) గ్రామంలో మేకలు కాస్తూ జీవనం సాగించేది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. కుటుంబ పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో పక్షవాతంతో మంచానికే పరిమితమైన తండ్రిని చూసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకుంది. ఆమె సోదరులు ఎన్టీపీసీ, గోదావరిఖనిలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారని సమాచారం.
బసంత్‌నగర్ ఎస్సై నూతి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో సుమలత గొంతు కోసి హత్య చేశారు. ఇంటికి తలుపులు లేకపోవడంతో నిందితులు నేరుగా లోపలికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బుధవారం ఉదయం జనగణన సర్వే కోసం వచ్చిన ఓ ఉపాధ్యాయుడు సుమలత రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రాంరెడ్డి, ఇన్‌చార్జి ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించి స్థానికులను ప్రశ్నించారు. పెద్దపల్లి నుంచి క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.
ఇదిలా ఉండగా, గ్రామానికి చెందిన వేల్పుల స్వామి అనే వ్యక్తి మృతురాలితో సాన్నిహిత్యంగా ఉండేవాడని, కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడని సమాచారం. సుమలత హత్యలో అతని ప్రమేయం ఉందని మృతురాలి సోదరుడు బౌతు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment