బాలికపై ఆరు నెలలుగా లైంగిక దాడి.. గర్భం దాల్చడంతో వెలుగులోకి ఘటన!
నాగర్‌కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట: మే 08: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు బాలికను బెదిరిస్తూ ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఏఎస్సై ప్రిస్కిల్లా తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన తల్లి, తమ్ముడితో కలిసి నివాసం ఉంటోంది. కొంతకాలం క్రితం బాలిక తండ్రి మరణించగా కుటుంబ బాధ్యతలు తల్లి భుజాలపై పడ్డాయి. ఈ క్రమంలో తల్లి పనుల నిమిత్తం తరచూ వేరే గ్రామాలకు వెళ్లేది.
ఈ పరిస్థితిని గమనించిన అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు, బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడంతో బాలిక భయంతో ఎవరికీ చెప్పలేదు.
దీన్ని అదనుగా తీసుకున్న నిందితుడు, తల్లి ఇంట్లో లేని ప్రతిసారీ బాలిక ఇంటికి వచ్చి పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఇటీవల బాలిక ఆరోగ్యంలో మార్పులు గమనించిన తల్లి అనుమానం వ్యక్తం చేసి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పరీక్షలు చేయించగా బాలిక గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది.
దీంతో బాలిక తల్లి శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా నిందిత యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment