కొనుగోలు కేంద్రాల సందర్శన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు
T. Harish Rao సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన సన్‌ఫ్లవర్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెలల తరబడి ధాన్యం, సన్‌ఫ్లవర్ కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి A. Revanth Reddy పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. “మూసీ, ఫ్యూచర్ సిటీపై ఉన్న ప్రేమ రైతులపై ప్రభుత్వానికి లేదని” మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు 40 రోజులుగా పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు నష్టపోతున్న సమయంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు. మాజీ సీఎం K. Chandrashekar Rao హయాంలో వరి కోతల ముందే సంచులు, లారీలు, నిధులు సిద్ధం చేసి రైతులకు అండగా నిలిచేవారని గుర్తు చేశారు.
సన్‌ఫ్లవర్ పంట విషయంలో ప్రభుత్వం విధించిన పరిమితులపై కూడా హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు 9 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుండగా, కేవలం 6.5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పి, అవి కూడా కొనడం లేదన్నారు. కేంద్ర కోటా పూర్తైందనే కారణంతో రైతులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం పంటల మార్పిడి చేయాలని ప్రోత్సహిస్తూనే, రైతులు పండించిన సన్‌ఫ్లవర్, మక్కలు, జొన్నలు, శనగలు కొనుగోలు చేయకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గతంలో జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసేదని, ప్రస్తుతం కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేసిందన్నారు.
మక్కలకు 26 క్వింటాళ్ల సీలింగ్ పెట్టి, సంచులు కూడా రైతులే తెచ్చుకోవాలని చెప్పడం దారుణమన్నారు. రైతుబంధు సకాలంలో ఇవ్వకపోవడం, యూరియా కొరత, కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సన్న వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు యాసంగి పంటకు బోనస్ లేదని చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు, బీ-గ్రేడ్ పేరుతో రైతుల నుంచి భారీగా కోతలు వేస్తున్నారని ఆరోపించారు.
చిన్నకోడూరులో సన్‌ఫ్లవర్ కొనుగోళ్లు 40 రోజులుగా నిలిచిపోవడంతో కుప్పల కింద పంట చెడిపోతోందని తెలిపారు. మద్దతు ధర రూ.7,720 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు కేవలం రూ.5,000 మాత్రమే ఇస్తున్నారని, దీనివల్ల రైతులు ఎకరాకు వేల రూపాయలు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
సిద్దిపేట మార్కెట్ యార్డ్‌లో నిల్వలు పెరిగిపోవడంతో నాలుగు రోజులుగా తాళం వేసి వడ్లు, మక్కలను లోపలికి అనుమతించడం లేదని ఆరోపించారు. లారీలు, సంచులు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే యూరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి రైతులకు అందుబాటులో ఉంచాలని, వడ్లతో పాటు సన్‌ఫ్లవర్, జొన్నలు, మక్కలు, శనగలను యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.

Post a Comment