-->

రెండు పాములు కాటేయడంతో నాలుగేళ్ల బాలుడు మృతి

జనగామ జిల్లాలో విషాదం... రెండు పాములు కాటేయడంతో నాలుగేళ్ల బాలుడు మృతి


జనగామ జిల్లా: మే 09: జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రెండు పాములు కాటు వేయడంతో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక సంఘటన జిల్లాలోని లక్ష్మణ్ తండాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. వేసవి తీవ్రత కారణంగా గ్రామంలోని పలువురు కుటుంబాల మాదిరిగానే చిన్నారి శ్రీయాన్ కుటుంబ సభ్యులు కూడా శుక్రవారం రాత్రి ఇంటి బయట ఆరుబయట నిద్రపోయారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో తొలుత ఒక కట్లపాము బాలుడిని కాటేసింది. కొద్ది సేపటికే మరో రక్తపింజర పాము కూడా కాటు వేసినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.

అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే ఆ రెండు పాములను చంపేసి, వాటిని వెంట తీసుకుని బాలుడిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విషం శరీరం మొత్తం వ్యాపించడంతో బాలుడి పరిస్థితి విషమించిందని, చికిత్స ఫలించక చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేసవికాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793