మాజీ డీజీపీ భార్య దారుణ హత్య.. జూబ్లీహిల్స్‌లో కలకలం
హైదరాబాద్, మే 08: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద తమ నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన నగర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇంట్లోని వేలిముద్రలు, ఇతర సాక్ష్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఈ హత్య వెనుక నేపాల్‌కు చెందిన గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే నేపాలీ మహిళ గత ఎనిమిది నెలలుగా అక్కడ పనిచేస్తోందని గుర్తించారు. సునంద ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆమె తన సహచరులకు తెలియజేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి సునందను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.
హత్య అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం దోచుకుని నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment