నరికివేసిన రావిచెట్టు తెల్లారేసరికి తిరిగి నిలబడింది?
ప్రకాశం జిల్లా, ముండ్లమూరు మండలం: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలో చోటు చేసుకున్న ఒక విచిత్ర ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేళ్లతో సహా పెకిలించి పక్కన పడేసిన రావిచెట్టు మరుసటి రోజు ఉదయానికి తిరిగి నిటారుగా నిలబడి కనిపించడం గ్రామస్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనను చాలామంది దైవ మహిమగా భావిస్తుండగా, మరికొందరు శాస్త్రీయ కారణాలపై చర్చిస్తున్నారు.
గ్రామంలో ఈ నెల 1న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమ కార్యక్రమాలకు రావి కలప అవసరమవడంతో గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలోని పాత రావిచెట్టు కొమ్మలను గ్రామస్థులు నరికారు. అనంతరం చెట్టు మోడుగా మిగిలిపోవడంతో దానిని వేళ్లతో సహా పెకిలించి పక్కన పడేశారు.
అయితే మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు చూసేసరికి ఆ చెట్టు తిరిగి నిలబడి ఉండటం అందరినీ విస్మయానికి గురిచేసింది. భారీ వృక్షం పూర్తిగా నేలకూలిన తర్వాత మళ్లీ నిలబడటం అసాధారణమని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి యంత్రాలు లేదా మనుషుల సహాయం లేకుండానే చెట్టు తిరిగి నిలబడిందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
ఈ ఘటన బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవ సమయంలోనే జరగడంతో గ్రామస్థులు దీన్ని స్వామివారి మహిమగా భావిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, ఆసక్తిగల ప్రజలు పెద్ద సంఖ్యలో మారెళ్ల గ్రామానికి తరలివస్తున్నారు.
గ్రామ మహిళలు ప్రత్యేకంగా 101 బిందెలతో నీళ్లు తీసుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా చెట్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ చెట్టుకు జలహారతి పట్టి, అభిషేకాలు నిర్వహించి, పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం భక్తి వాతావరణంతో కళకళలాడుతోంది.
ఇదిలా ఉండగా, ఈ ఘటనకు శాస్త్రీయ కారణాలు కూడా ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. చెట్టు పూర్తిగా వేర్లు తెగిపోకపోవడం లేదా నేల తడిగా ఉండటం వల్ల తిరిగి నిలబడే అవకాశం ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. అయినప్పటికీ భక్తులు మాత్రం దీనిని కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మహిమగా భావిస్తూ ప్రత్యేక పూజలు కొనసాగిస్తున్నారు.

Post a Comment