-->

యువకుడిని కత్తులతో దారుణ హత్య యువతి ఇంటి ముందు కుటుంబ సభ్యుల భారీ నిరసన

 

యువకుడిని కత్తులతో దారుణ హత్య యువతి ఇంటి ముందు కుటుంబ సభ్యుల భారీ నిరసన

ప్రేమ వ్యవహారం విషాదాంతం.. 

Hyderabad : ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన నగరంలో కలకలం రేపింది. నడిరోడ్డుపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి యువకుడిని కిరాతకంగా హత్య చేసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

జవహర్‌నగర్‌కు చెందిన యావన్ (23) బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడు గత నాలుగేళ్లుగా సీతాఫల్‌మండికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత పలుమార్లు యావన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, అతడు తన స్నేహితుడి ఇంటి వద్ద ఉంటూ యువతిని కలుస్తూనే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో యువతి బంధువులు కక్ష పెంచుకున్నారని సమాచారం. బుధవారం రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు యావన్‌పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ప్రాణాలను కాపాడుకునేందుకు యావన్ పరుగులు తీసినా, దుండగులు వెంటాడి మరీ నడిరోడ్డుపై 17 చోట్ల కత్తితో పొడిచినట్లు తెలిసింది. తీవ్ర రక్తస్రావంతో యావన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనతో యావన్ కుటుంబంలో విషాదం నెలకొంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు యువతి ఇంటి ముందు భారీ నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793