బస్సు కోసం వేచి చూస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంభీరావుపేట మండలం రాజరాజేశ్వరరావు కాలనీలోని గజసింగారం స్టేజి వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపైకి అదుపుతప్పిన కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మి(35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళతో పాటు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన రెండు సీసీ కెమెరాల ఫుటేజీలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కొంత మేర కనిపిస్తుండగా, కారు డ్రైవర్ నిర్లక్ష్యం పూర్తిగా ఉన్నట్లు స్పష్టమవుతోందని స్థానికులు చెబుతున్నారు. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి బస్సు స్టేజి వద్ద నిలబడి ఉన్న వారిపైకి ఎక్కినట్లు ఫుటేజీల్లో కనిపిస్తోంది.
ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment