సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ఉన్మాది చేతిలో ప్రముఖ సింగర్ దారుణ హత్య!
పంజాబీ సంగీత పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ పంజాబీ గాయని ఇందర్ కౌర్ అలియాస్ యష్ ఇందర్ కౌర్ (29) దారుణ హత్యకు గురైంది. మంగళవారం (మే 19) ఉదయం ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు షాక్‌కు గురయ్యారు.
ఆరు రోజుల క్రితం కొందరు దుండగులు ఆమెను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అప్పటి నుంచి పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చివరకు ఆమె మృతదేహం లభించడంతో పంజాబీ సినీ, సంగీత రంగాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెళ్లికి నిరాకరించిందనే కారణంతోనే ఓ ఉన్మాది ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ప్రేమ పేరుతో జరిగిన మోసం చివరకు హత్యకు దారితీసిన ఘటనగా ఇది మారింది.
చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
మరణానికి కేవలం ఐదు రోజుల ముందు, మే 13న ఇందర్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసింది. బ్రౌన్ షర్ట్ ధరించి తలదించుకుని ఉన్న ఫోటోకు కేవలం హార్ట్ ఎమోజీని మాత్రమే క్యాప్షన్‌గా పెట్టింది. అయితే ఆ ఫోటో 2022 మే 19న పోస్ట్ చేసిన పాత ఫోటో కావడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.
రెండేళ్లుగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేని ఆమె, 2024 అక్టోబర్‌లో జర్మనీ ట్రిప్ ఫోటోల తర్వాత మళ్లీ ఇటీవలే పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. కిడ్నాప్ అయిన తర్వాత ఆమె ఫోన్‌ను దుండగులే వాడి ఈ పోస్టు చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్‌స్టా పరిచయం.. ప్రాణాంతకంగా మారిన ప్రేమ
పోలీసుల వివరాల ప్రకారం, పంజాబ్‌లోని మోగా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో మూడు సంవత్సరాల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇందర్ కౌర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, అనంతరం ప్రేమగా మారింది.
అయితే ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్నారని ఆలస్యంగా తెలుసుకున్న ఇందర్ కౌర్ తీవ్రంగా కలత చెందింది. దీంతో అతనితో సంబంధాన్ని పూర్తిగా తెంచుకుని, పెళ్లికి నిరాకరించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ వ్యక్తి కక్ష పెంచుకుని చివరకు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Post a Comment