నడి రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ప్రముఖ హాస్య నటి పావలా శ్యామల
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో తన హాస్య నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి పావలా శ్యామల ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో కనిపించడం కలకలం రేపుతోంది.
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్యామల, నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. అయితే వైద్య ఖర్చులకు సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
దీంతో అర్థరాత్రి సమయంలో క్యాబ్ డ్రైవర్ ఆమెను కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలోని ఫుట్‌పాత్ వద్ద దింపి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఫుట్‌పాత్‌పై అనారోగ్యంతో బాధపడుతూ ఒంటరిగా కూర్చున్న శ్యామలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆమెను సురక్షితంగా ఆర్కే ఫౌండేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై సినీ అభిమానులు, పలువురు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పంచిన నటి ఈ స్థితికి చేరుకోవడం బాధాకరమని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Post a Comment