లంచం తీసుకుంటూ ఎసిబి వలకు చిక్కిన కొమురవెల్లి పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. రూ.10 వేల లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్, సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
ఎసిబి అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్లాట్‌లో గ్రామ పంచాయతీ అధికారులు డ్రైనేజీ పైప్‌లైన్ వేశారు. ఆ పైప్‌లైన్‌ను తొలగించే అధికారిక పని కోసం పంచాయతీ కార్యదర్శి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు.
పక్కా ప్రణాళికతో సోమవారం సాయంత్రం 4.40 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు దాడి చేశారు. కార్యదర్శి ఆదేశాల మేరకు సర్పంచ్ భర్త అంజనేయులు లంచం సొమ్ము స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.
అవినీతికి పాల్పడి అనుచిత లబ్ధి పొందేందుకు ప్రయత్నించినందుకు గాను పంచాయతీ కార్యదర్శి రాజు గౌడ్, సర్పంచ్ భర్త అంజనేయులును అరెస్టు చేసినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. వారిని హైదరాబాద్‌లోని ఎసిబి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment