వైద్యం వికటించి యువకుడి మృతి.. ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడిని అత్యవసర చికిత్స కోసం సూర్యాపేటలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం వికటించడంతో యువకుడి పరిస్థితి మరింత విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం పరిస్థితి అదుపులో లేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం యువకుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు రోహిణి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువకుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మధ్యవర్తుల ద్వారా రాజీ ప్రయత్నాల ఆరోపణలు
“బతికించండి మహాప్రభో” అంటూ ఆస్పత్రికి తీసుకువచ్చిన తమ కుమారుడిని చివరకు శవంలా మార్చారని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన చికిత్స అందించకుండా చివరి దశలో ప్రభుత్వాస్పత్రికి తరలించడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించే ఓ వైద్యురాలికి సంబంధించిన హాస్పిటల్ ఇదని కొందరు బంధువులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రాణాల కంటే ధనార్జనే లక్ష్యంగా కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రులు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
ఘటన అనంతరం హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయిందని, అనంతరం మధ్యవర్తుల ద్వారా రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రాణానికి ఖరీదు కడుతూ భేరసారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Post a Comment