-->

పంట ఆరబెట్టిన చోట ఆగిన యువకుడి ప్రాణం

పంట ఆరబెట్టిన చోట ఆగిన యువకుడి ప్రాణం


రేవల్లి : రహదారిపై ఆరబోసిన మొక్కజొన్న రాశి ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన ఏదుల శివారులోని పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ఈ ఘటనతో అనంతపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదుల మండల పరిధిలోని అనంతపురం గ్రామానికి చెందిన నరసింహా రోడ్డుకు అడ్డంగా మొక్కజొన్న కుప్ప పోసి, దానిపై నల్లని కవర్ కప్పినట్లు తెలిపారు. రాత్రి సమయంలో అది స్పష్టంగా కనిపించకపోవడంతో కృష్ణ అనే యువకుడు ద్విచక్రవాహనంతో వెళ్తూ ఆ రాశిపైకి ఎక్కి అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికులు ఘటనను గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి దానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జగన్ మోహన్ తెలిపారు. నిర్లక్ష్యంగా రోడ్డుకు అడ్డంగా మొక్కజొన్న పోసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రహదారులపై పంటలను ఆరబెట్టడం సాధారణమే అయినప్పటికీ, ఇటీవలి కాలంలో అది ప్రమాదకరంగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కనిపించని విధంగా ధాన్యపు రాశులు వేయడం, వాటిపై నల్ల కవర్లు కప్పడం వాహనదారులకు ముప్పుగా మారుతోందని అన్నారు.

“ఒక్కరి పంట కోసం ఇంకొకరి ప్రాణం పోవాలా?” అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రహదారులపై ధాన్యపు రాశులు వేయడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ రైతులు, వ్యాపారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పంటను కాపాడే క్రమంలో ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై గోపాల్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793