మావోయిస్టు పార్టీలో లొంగిపోయిన సభ్యులకు రూ.55.60 లక్షల రివార్డులు అందజేసిన ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రివార్డులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం తన చేతుల మీదుగా అందజేశారు.
ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ క్యాడర్లలోని 10 మంది సభ్యులకు మొత్తం రూ.55,60,000లను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. మావోయిస్టు పార్టీలో వారు నిర్వహించిన బాధ్యతలు, క్యాడర్ స్థాయిని ఆధారంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ రివార్డులను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
రివార్డులు అందుకున్న వారిలో ఒకరు స్టేట్ కమిటీ మెంబర్, ఒకరు డివిజనల్ కమిటీ మెంబర్, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఇద్దరు దళ సభ్యులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు లొంగిపోయిన సభ్యుల ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన నగదును విలాసాలకు వినియోగించకుండా, జీవనోపాధికి ఉపయోగపడే విధంగా సక్రమంగా ఖర్చు చేసుకోవాలని సూచించారు.
జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” కార్యక్రమానికి ఆకర్షితులై మరింత మంది మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసంతో పాటు ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.

Post a Comment