-->

భర్తతో విడాకులు.. ప్రియుడి మోసం.. కూతురితో కలిసి మహిళ ఆత్మహత్య


భర్తతో విడాకులు.. ప్రియుడి మోసం.. కూతురితో కలిసి మహిళ ఆత్మహత్య


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తతో విడాకులు తీసుకొని తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ మహిళను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించిన యువకుడు చివరకు మరో యువతితో వివాహానికి సిద్ధం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ తన తొమ్మిదేళ్ల కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తగూడెం నగరంలోని బాబు క్యాంప్ ప్రాంతానికి చెందిన ఆర్. రమ్య (35)కు కొన్నేళ్ల క్రితం నవీన్‌తో వివాహమైంది. వీరికి ఆద్య అలియాస్ చెర్రి (9) అనే కుమార్తె ఉంది. అయితే దాంపత్య జీవితంలో తలెత్తిన విభేదాల కారణంగా రమ్య, నవీన్ విడాకులు తీసుకున్నారు. అనంతరం రమ్య తన కుమార్తెతో కలిసి తల్లిగారింటి వద్ద నివాసం ఉంటోంది.

విడాకుల తర్వాత కూడా నవీన్ అప్పుడప్పుడు వచ్చి కూతురిని చూసుకుని వెళ్లేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఇటీవల నవీన్ మృతి చెందాడు. ఈ క్రమంలో రమ్యకు తమ ఇంటి సమీపంలో నివసించే సుధాకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. రమ్యను పెళ్లి చేసుకుంటానని, ఆమె కుమార్తెను కూడా బాగా చూసుకుంటానని సుధాకర్ నమ్మించాడని తెలిసింది.

అయితే కొంతకాలానికి సుధాకర్ మరో యువతితో వివాహానికి సిద్ధమవుతున్నాడనే విషయం రమ్యకు తెలిసింది. దీంతో తీవ్ర నిరాశ, మనస్తాపానికి గురైన ఆమె గత నెల 28న తన కుమార్తె ఆద్యకు విషం ఇచ్చి, అనంతరం తానూ విషం తాగినట్లు సమాచారం.

విషయం గమనించిన రమ్య తల్లి, సోదరుడు వెంటనే వారిని కొత్తగూడెంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తర్వాత ఖమ్మంలోని ఆస్పత్రికి మార్చి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తల్లీకూతురు ఇద్దరూ మృతి చెందారు.

డిప్రెషన్ కారణంగానే రమ్య ఈ ఘాతుక నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793