-->

జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం: ఉద్యమకారుల ఫోరం పిలుపు

జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం: ఉద్యమకారుల ఫోరం పిలుపు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సంఘం జిల్లా కార్యదర్శి కేజీఎస్ మ్యాథ్యూస్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన తొలిదశ, మలిదశ ఉద్యమకారులంతా జూన్ 2న నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.

కొత్తగూడెం బస్టాండ్‌లోని TBGKS కార్యాలయంలో కేజీఎస్ మ్యాథ్యూస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారుల సేవలను ఎప్పటికీ మరవలేమన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు ఈ అవతరణ దినోత్సవం ఒక గౌరవప్రదమైన సందర్భంగా నిలుస్తుందని చెప్పారు.

జూన్ 2న కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో జాతీయ పతాకంతో పాటు తెలంగాణ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఉద్యమకారులు, యువత, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఫోరం నిరంతరం కృషి చేస్తోందని మ్యాథ్యూస్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తల సమస్యలను పలుమార్లు తెలంగాణ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి సమయం ఆసన్నమైందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో సంఘం నాయకులు కామేశ్వరరావు, రాజయ్య, కొమరయ్య, వీరస్వామి, సీతారాం, మంగపతి, గౌస్, పురుషోత్తం, మాతి నాగేశ్వరరావు, కృష్ణార్జునరావు, మండే అంజనేయులు, టి. వెంకట రాజయ్య, గోడ రమేష్, నాగభూషణం, డామేరాకొండ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793