నడిరోడ్డుపై మహిళ డ్రెస్సును పైకి లేపిన సైకో.. హైదరాబాద్‌లో కలకలం
హైదరాబాద్ నగరంలోని మణికొండ పరిధిలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పసిబిడ్డను ఎత్తుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ పట్ల ఓ గుర్తుతెలియని యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న అల్కాపూర్ టౌన్‌షిప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళనకు దారితీసింది.
స్థానికుల వివరాల ప్రకారం.. అల్కాపూర్ టౌన్‌షిప్ రోడ్డుపై ఒక మహిళ తన చిన్నారిని చేతుల్లో ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు అకస్మాత్తుగా ఆమె డ్రెస్‌ను పైకి లాగి వికృతంగా ప్రవర్తించాడు. ఊహించని ఈ ఘటనతో మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది. పగటిపూట నడిరోడ్డుపైనే ఈ ఘటన జరగడం స్థానికులను షాక్‌కు గురిచేసింది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలు బయటకు రావడంతో మణికొండ, అల్కాపూర్ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతూ పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయని, రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా మహిళలు భయాందోళనల మధ్య సంచరించాల్సి వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సరైన స్థాయిలో పెట్రోలింగ్ నిర్వహించడం లేదని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహిళల భద్రత కోసం మణికొండ ప్రాంతంలో ప్రత్యేక నిఘా, పెట్రోలింగ్ పెంచాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మహిళా సంఘాలు, కాలనీ వాసులు కోరుతున్నారు.

Post a Comment