వీడు మామూలోడు కాదు.. స్కెచ్ వేస్తే టార్గెట్ ఫిక్స్..
నారాయణపేట జిల్లా పోలీసులకు కొంతకాలంగా తలనొప్పిగా మారిన వరుస చోరీల కేసుల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముసుగు దొంగను మక్తల్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి ఆట కట్టించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన నిందితుడు డబ్బుల కోసం పక్కా ప్లాన్‌తో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో మక్తల్ ఎస్ఐ వై. భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి పోలీసులను గమనించి అనుమానాస్పదంగా బైక్‌ను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అతడు కర్రెం సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ తిప్పి అలియాస్ సూర్యగా గుర్తించారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా మక్తల్ ప్రాంతంలో జరిగిన పలు దొంగతనాలకు తానే పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.
నిందితుడి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా మంకీ క్యాప్, గ్లౌజులు, ఎలక్ట్రిక్ కట్టర్, భారీ సుత్తి, కట్టింగ్ ప్లేయర్స్, స్క్రూడ్రైవర్లు వంటి దొంగతనాలకు ఉపయోగించే పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీ చేసిన ఆస్తికి సంబంధించిన వివరాలు కూడా లభించాయి.
పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డ నిందితుడు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గత ఏడాది నుంచి చోరీల బాట పట్టినట్లు తెలిసింది. పగటి సమయంలో టార్గెట్ చేసిన షాపులు, వైన్ షాపులు, తాళం వేసిన ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి.. రాత్రి సమయంలో మంకీ క్యాప్, గ్లౌజులు ధరించి గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చోరీలకు పాల్పడేవాడు.
షట్టర్ల తాళాలు, ఇళ్ల తలుపులు ఎలక్ట్రిక్ కట్టర్‌తో కట్ చేసి నగదు, బంగారం, వెండి ఆభరణాలు, మద్యం సీసాలు, సిగరెట్లు ఎత్తుకెళ్లేవాడని పోలీసులు తెలిపారు.
గత సంవత్సరం మే నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 10 చోరీ కేసుల్లో నిందితుడి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 9 కేసులు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగా.. మరో కేసు మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. ఈ చోరీల్లో సుమారు రూ.10 లక్షల నగదు, 2 తులాల బంగారం, 3 కిలోల వెండి, మద్యం సీసాలు, సిగరెట్లు దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్ట్ సమయంలో నిందితుడి నుంచి రూ.5,04,000 నగదు, 13 గ్రాముల బంగారం, 60 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వినీత్ మాట్లాడుతూ.. వ్యాపారులు తమ దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే Dial-100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Post a Comment