-->

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష


హైదరాబాద్‌లో 2019లో జరిగిన బాలుడిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి పోక్సో ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. పోక్సో చట్టం ప్రత్యేక సెషన్స్ జడ్జి కోర్టు మంగళవారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళ్తే.. 2019 అక్టోబర్ 29న 11 ఏళ్ల బాలుడు రాణిగంజ్‌కు వెళ్లేందుకు జలవిహార్ సమీపంలో ఓ ఆటో ఎక్కాడు. ఎన్బీటీనగర్ పాటిగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ రెహ్మాన్ ఆటోను మార్గమధ్యలో దారి మళ్లించి బతుకమ్మకుంట సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పొదల్లోకి బాలుడిని బలవంతంగా తీసుకెళ్లాడు. అక్కడ బాలుడిపై ప్రకృతి విరుద్ధంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో బాలుడు ప్రతిఘటించడంతో ఆగ్రహించిన నిందితుడు బాలుడి తలను గోడకు బలంగా కొట్టాడు. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. బాలుడి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని బాలుడిని రక్షించారు. అనంతరం నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్‌రావు నిందితుడిపై నేరం రుజువైందని తేల్చి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధించారు.

అదేవిధంగా బాధిత బాలుడికి రూ.75 వేల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793