-->

బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడని.. భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడని.. భర్తను దారుణంగా హత్య చేసిన భార్య


హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వేరుగా ఉంటున్న భార్య ఇంటికి పిల్లలను చూడటానికి వెళ్లిన భర్తను భార్య, ఆమె తమ్ముడు, మరో వ్యక్తి కలిసి దాడి చేసి హత్య చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా హజీపూర్ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్‌ (31) బీఎన్‌రెడ్డినగర్‌లో నివాసముంటూ ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. కుటుంబ విభేదాల కారణంగా అతని భార్య స్వప్న పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది.

మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వెంకటేశ్ తన పిల్లలను చూసేందుకు రైతుబజార్ సమీపంలోని డబుల్ బెడ్‌రూం కాలనీలో ఉన్న భార్య ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వెంకటేశ్‌తో భార్య స్వప్నకు వాగ్వాదం జరిగింది.

అనంతరం స్వప్న తన తమ్ముడు పాండుతో కలిసి వెంకటేశ్‌ను మూడో అంతస్తు నుంచి కిందకు తీసుకువస్తూ దాడి చేసినట్లు సమాచారం. ఆ తరువాత పాండు తన స్నేహితుడు జగదీష్‌ను పిలిపించుకుని ముగ్గురూ కలిసి వెంకటేశ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ స్పృహ తప్పి పడిపోవడంతో, “బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడు” అంటూ మరింతగా కొట్టి గ్రౌండ్ ఫ్లోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా వెంకటేశ్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతుడి సోదరుడు గురు తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య స్వప్న, ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్‌లపై హత్య కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. హత్యకు దారితీసిన అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793