తెలంగాణపై భానుడి ప్రతాపం.. ఒక్కరోజే 9 మంది మృతి
తెలంగాణ రాష్ట్రం భానుడి భగభగలతో అగ్నిగుండంలా మారింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బ కారణంగా మొత్తం 9 మంది మృతి చెందడం కలకలం రేపింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లికి చెందిన మహిళా రైతు నెర్రగడ్డం లచ్చవ్వ (55), వేములవాడ మండలం ఆరెపల్లికి చెందిన ఎంగె రాజిరెడ్డి (60) అలియాస్ భీమన్న వడదెబ్బతో మృతి చెందారు. అలాగే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన కందుకూరి రాజమ్మ (83), ధర్మారం మండలం నర్సింగాపూర్‌కు చెందిన రైతు సామ లచ్చిరెడ్డి (60), పెద్దపల్లి మండలం కొత్తపల్లికి చెందిన కనుకుంట్ల కనకయ్య (75), హుజూరాబాద్ 21వ వార్డుకు చెందిన దివ్యాంగుడు గాజర్ల సతీశ్ (45) కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఇక మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన నేరెళ్ల సోమయ్య (72), ములుగు మున్సిపాలిటీ పరిధి ప్రేమ్‌నగర్‌కు చెందిన పారిశుధ్య కార్మికుడు బోడ సాంబయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మద్దెల్‌బీడ్ గ్రామానికి చెందిన దాసరి హన్మంతు (50) వడదెబ్బకు గురై మృతి చెందారు.
ఉదయం నుంచే వడగాలుల తీవ్రత
తెలంగాణ వ్యాప్తంగా హీట్‌వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి.
అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
గురువారం, శుక్రవారం కూడా ఎండ తీవ్రత కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు తిరగకపోవడం, తలకు గుడ్డ కట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
కాలిపోయిన మోటార్‌సైకిల్.. ఆర్టీసీ బస్సు టైరు నుంచి పొగలు
ఎండల తీవ్రతతో వాహనాల్లో కూడా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేటకు చెందిన ఎల్కరి సంజీవ్ అటవీ ప్రాంతం గుండా మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్‌పై ఉన్న మరో మహిళ, ఇద్దరు చిన్నారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే మోటార్‌సైకిల్ పూర్తిగా కాలిపోయింది.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు టైరు నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే నీళ్లు చల్లడంతో ప్రమాదం తప్పింది.

Post a Comment