హైదరాబాద్‌లో ఏసీబీ వలలో బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ, కానిస్టేబుల్
హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు పోలీసు సిబ్బందిని లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మే 20, 2026న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో బోయిన్‌పల్లి పీఎస్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. కిరణ్ నందిత (AO-1), పోలీస్ కానిస్టేబుల్ బి. విజయ్ కుమార్ (AO-2)లను ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఫిర్యాదుదారుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 కింద నమోదైన కేసులో బెయిల్ షరతులను సడలించడం, కేసు పూర్తయ్యే వరకు పోలీసు సహకారం అందించడం కోసం రూ.30 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కానిస్టేబుల్ విజయ్ కుమార్ రూ.10 వేల లంచం తీసుకుని, మరింత డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో రూ.30 వేల లంచం నగదు ఎస్‌ఐ కిరణ్ నందితకు చెందిన ఆక్టివా వాహనం డిక్కీలో లభ్యమైంది. ఆ వాహనం బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పార్కింగ్ ప్రాంగణంలో నిలిపి ఉంచినట్లు అధికారులు తెలిపారు. అధికారిక విధులను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందేందుకు ఇద్దరు నిందితులు అవినీతి చర్యలకు పాల్పడినట్లు ఏసీబీ పేర్కొంది.
ఈ కేసులో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి నాంపల్లిలోని SPE & ACB ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు.
లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేయాలనుకునే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వం కార్యాలయాలు, ముఖ్య ప్రజా ప్రదేశాల్లో ఏసీబీ QR కోడ్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Post a Comment