చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి.. జగిత్యాల జిల్లాలో విషాదం
Telanganaలోని Jagityal district జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని శివగంగా ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన మన్విత్ (10), మనస్విని (9) అనే అన్నాచెల్లెలు, అలాగే షర్వింద్ (7) కలిసి మధ్యాహ్న సమయంలో ఆలయం సమీపంలోని కోనేరువద్దకు వెళ్లారు. అక్కడ ఆడుకుంటూ నీటిలోకి దిగిన చిన్నారులు లోతైన ప్రాంతానికి వెళ్లడంతో ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈత రాకపోవడంతో వారు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు.
చిన్నారులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు గురై వెతకడం ప్రారంభించారు. అనంతరం కోనేరులో గాలింపు చేపట్టగా ముగ్గురు చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కలచివేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో కొండాపూర్ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అన్నాచెల్లెలు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు కూడా చిన్నారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

Post a Comment