మార్కెట్ యార్డులో పందుల బెడద.. రైతులకు తీరని నష్టం
కరీంనగర్ జిల్లా, మే 21: వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా పేరుగాంచిన తెలంగాణలో రైతులు తమ పంటలను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ యార్డుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ధాన్యం కొనుగోలు గడువు ముగియడానికి మరో 10 రోజులు మాత్రమే ఉండగా, కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
వరి కోతలు పూర్తై నెల రోజులు గడిచినా కొనుగోళ్లు మందగించడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు లక్ష్యంలో ఇప్పటివరకు సగం కూడా పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని చెబుతున్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు పందుల బెడదతో ధాన్యం నష్టపోతుండగా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గంగాధర మండలం కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యంపై పందులు స్వైర విహారం చేస్తున్న ఘటన ఆందోళన కలిగిస్తోంది. యార్డులోకి ప్రవేశిస్తున్న పందులు ధాన్యం కుప్పలను చెదరగొడుతూ రైతులకు భారీ నష్టం కలిగిస్తున్నాయి.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని పందులు నాశనం చేస్తుండగా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ యార్డులో సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో పందులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ధాన్యం నాణ్యత దెబ్బతింటోందని, కొంత ధాన్యం పూర్తిగా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిస్థితి ఇంత తీవ్రంగా మారడంతో రైతులు ధాన్యం వద్దే కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్ యార్డులో భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment