-->

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన..

అంబులెన్స్ లేక మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు


భద్రాచలం పట్టణంలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన కండె వెంకన్న (42) వడదెబ్బకు గురై స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు సమాచారం.

అయితే ప్రభుత్వ ఆసుపత్రి నిబంధనల ప్రకారం మృతదేహాన్ని ప్రభుత్వ అంబులెన్స్ ద్వారా ఇంటికి తరలించే అవకాశం ఉండగా, వెంకన్న మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేక ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడంతో, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన మధ్య వెంకన్న మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వైద్య సేవల నిర్వహణ, అత్యవసర సౌకర్యాల అందుబాటుపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సంబంధిత అధికారులు ఘటనపై స్పందించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793