15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మండల సర్వేయర్
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ కమ్మరి బ్రహ్మయ్యను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూమి సర్వే నిర్వహించినందుకు ఫిర్యాదుదారుడి నుంచి లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ అధికారులు వల పన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి తల్లిదండ్రులకు సంబంధించిన భూమి సర్వే నిర్వహించినందుకు రూ.15 వేల లంచం ఇవ్వాలని సర్వేయర్ బ్రహ్మయ్య డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా ఈ నెల 6న ముందస్తుగా రూ.5 వేల నగదును స్వీకరించాడు. అనంతరం మిగిలిన మొత్తంలో భాగంగా రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
సర్వేయర్ వద్ద నుంచి రూ.10 వేల లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ నిర్ధారించింది.
నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@Telangana ACB) ద్వారా కూడా ఫిర్యాదులు అందజేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.

Post a Comment