గ్రామపంచాయతీలకు కేంద్రం భారీ నిధులు విడుదల
హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను కేటాయించింది. గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సేవలను కొనసాగించడంలో పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొంతకాలంగా పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామపంచాయతీలకు నిధుల విడుదల కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి తెలంగాణకు మొత్తం రూ.9,968 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్రం తెలిపిన ప్రకారం ఈ నిధులను గ్రామపంచాయతీల మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్‌లైట్‌ల ఏర్పాటు వంటి ప్రజా సేవలకే వినియోగించాలి. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం ఈ గ్రాంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని స్పష్టం చేసింది.
నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కఠిన పర్యవేక్షణ నిబంధనలను అమలు చేయనుంది. ప్రతి స్థానిక సంస్థ తమ వ్యయ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించింది. అలాగే త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
ఆడిట్‌లలో లోపాలు బయటపడితే వెంటనే సరిదిద్దాలని, నిధుల దుర్వినియోగం లేదా అవకతవకలు తేలితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దేశవ్యాప్తంగా 16వ ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలానికి రూ.4,35,236 కోట్ల గ్రాంట్లను ప్రకటించింది. ఇందులో 80 శాతం నిధులు నేరుగా గ్రామపంచాయతీలకు, 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించనున్నారు. ప్రతి ఏడాది జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతలుగా ఈ నిధులను విడుదల చేయనున్నారు.
2026 అంచనాల ప్రకారం గ్రామీణ జనాభాకు 90 శాతం, రాష్ట్ర వైశాల్యానికి 10 శాతం వెయిటేజీ ఇవ్వగా, తెలంగాణకు గ్రామీణ జనాభా ఆధారంగా 1.92 శాతం, వైశాల్యం ఆధారంగా 0.37 శాతం వాటా లభించింది. ఈ లెక్కన రాష్ట్రానికి మొత్తం రూ.9,968 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

Post a Comment